Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఆదివాసీ హక్కులు,చట్టాల పరిరక్షణకు ప్రతి కార్యకర్త ఉద్యమించాలి ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు సొంది మల్లు దొర

Author
Posted By G KALYAN KUMAR
| 06 Nov 2026, 05:13 PM | TELANGANA
ఆదివాసీ హక్కులు,చట్టాల పరిరక్షణకు ప్రతి కార్యకర్త ఉద్యమించాలి ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు సొంది మల్లు దొర

ఇల్లందు, నవంబర్ 06:
ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఇల్లందు మండల శాఖ ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం గౌరవ సలహాదారులు కొరస కోటయ్య, మండల అధ్యక్షులు మీసాల రామచందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సొంది మల్లు దొర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల హక్కులను, చట్టాలను, రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక రక్షణలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆదివాసీపై ఉందని అన్నారు. ముఖ్యంగా ఆదివాసీ సంఘాల నాయకులు, మండల స్థాయి కమిటీ సభ్యులు, గ్రామస్థాయి కార్యకర్తలు ఆదివాసీ హక్కుల పరిరక్షణలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఆదివాసీల హక్కుల కోసం రాజ్యాంగం కల్పించిన ఐదవ షెడ్యూల్,1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం,పీసా చట్టం,అటవీ హక్కుల చట్టం వంటి చట్టాలపై ప్రతి కార్యకర్తకు పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు.ఈ చట్టాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆదివాసీ గ్రామాల్లో ఆచరణలో అమలయ్యేలా నిరంతరం కృషి చేయాలని సూచించారు.
1/70 చట్టం ఆదివాసీల భూములకు రక్షణ కవచం వంటిదని,ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.అటవీ భూములపై ఆదివాసీలకు ఉన్న హక్కులను, గ్రామసభల అధికారాలను, సంప్రదాయ ఆచార వ్యవహారాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు, విద్య, వైద్యం,ఉపాధి,భూమి, అటవీ హక్కుల విషయంలో ఆదివాసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ యువత విద్యావంతులై తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇప్పటివరకు ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక ఉద్యమాలు,పోరాటాలు జరిగినప్పటికీ ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయని అన్నారు. అందువల్ల వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా సంఘటితంగా పనిచేస్తూ ఆదివాసీ సమాజ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపారు.
ప్రతి మండల కమిటీ గ్రామస్థాయిలో పర్యటించి ఆదివాసీ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని, వారి సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.ఆదివాసీల ఐక్యతే మన బలం, హక్కుల పరిరక్షణే మన లక్ష్యం కావాలని అన్నారు.
ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ సలహాదారులు చీమల వెంకటేశ్వర్లు ( CM) ఉపాధ్యక్షులు ఊకే చేతన్య, ప్రధాన కార్యదర్శి చింత ఉపేందర్, కార్యదర్శి సనప గోవర్ధన్ ATA జిల్లా మహిళా నాయకురాలు మోకాళ్ళ ముత్తమ్మ, ఈప రమణ, ATA ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి అరెం లక్ష్మీనారాయణ ఆదివాసి సంక్షేమ పరిషత్ ఇల్లందు మండల కమిటీ నాయకులు, ప్రధాన కార్యదర్శి ఈసం హరీష్ చీమల ప్రసాద్ మహిళా నాయకురాలు సోది గౌతమి ఈసాల రవిబాబు కుంజ హేమలత సువర్ణపాక కిరణ్ బచ్చల భాస్కర్ మొదలగువారు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి