🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 22 November 2026, 9:14 am Posted by : Shaik Said baji

కార్మికులపై దాడులు చేస్తే సహించేది లేదు!

News Image
  • నల్గొండ మున్సిపల్ కార్మికురాలిపై దాడి ఘటనకు నిరసనగా సత్తుపల్లిలో కార్మికుల ఆగ్రహం
  • • నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల బహిష్కరణ
  • • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • • కార్మికుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిరసన

సత్తుపల్లి:
పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజారోగ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికులపైనే దాడులు జరగడం దారుణమని సత్తుపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్మికురాలిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లి మున్సిపల్ కార్మికులు శనివారం ఉదయం విధులను బహిష్కరించి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు.
కార్మికుల శ్రమకు ఇదేనా గౌరవం?
ఈ సందర్భంగా సత్తుపల్లి మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కంటెపూడి సుధాకర్ మాట్లాడుతూ.. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తూ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై దాడులకు పాల్పడటం అమానుషమని మండిపడ్డారు.
కార్మికులపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, నల్గొండ ఘటనలో బాధ్యులపై తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మున్సిపల్ కార్మికులకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఇనుపసూరి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి తొగర్త శ్రీను, సహాయ కార్యదర్శులు ధారావత్ కిరణ్, షేక్ బుడేన్, పురుషోత్తం, పి. సత్యనారాయణ, మందా శ్రీనివాసరావు, క్రాంతమ్మ, పూచి రవి, ప్రవీణ్, నాగేశ్వరరావు, సాంబయ్య, పూజల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
🏠 Home