🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 6:56 pm Posted by : Chand Pasha

ఎస్ఐఆర్ గడువు డిసెంబర్ 22 వరకు పొడిగింపు

News Image
  • అర్హులైన ఓటర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – అదనపు కలెక్టర్ వినోద్ కుమార్

సీకే న్యూస్ ప్రతినిధి – వనపర్తి జిల్లా, నవంబర్ 18:
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం గడువును డిసెంబర్ 22వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ సూచించారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా రాజకీయ పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
బుధవారం అదనపు కలెక్టర్ తన ఛాంబర్‌లో ఎస్ఐఆర్ పురోగతి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా రూపకల్పన తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే విడుదలైన ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హులు అవసరమైన పత్రాలతో తమ వివరాలను సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణలపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ప్రజలకు వివరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు 29,272 దరఖాస్తులు
వనపర్తి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు 29,272 దరఖాస్తులు అందినట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు. వీటిలో 27 వేలకు పైగా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తులను కూడా నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఈ నెల 25వ తేదీన పట్టభద్రుల ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. జాబితా విడుదల అనంతరం కూడా నిబంధనల ప్రకారం ఓటరు నమోదుకు అవకాశం ఉంటుందని, అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాంరెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home