గిరిజన విద్యార్థుల భద్రత గాలికి
- *గిరిజన విద్యార్థుల భద్రత గాలికి..*
- *అధికారుల హడావుడి వేడుకలకే పరిమితం!*
- అధికారులకు కార్లు.. విద్యార్థినులకు ట్రాక్టర్ ట్రాలీ!
- బిర్సా ముండా జయంతి వేడుకల నిర్వహణలో ఆర్భాటం.. విద్యార్థుల రవాణాలో నిర్లక్ష్యం
- సి కె న్యూస్ ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో నిర్వహించిన భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో అధికారుల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం గురించి గొప్పగా ప్రసంగించిన అధికారులే గిరిజన బాలికల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వేడుకలకు అధికారులు తమ వాహనాల్లో హాజరై తిరిగి వెళ్లగా, కార్యక్రమానికి వచ్చిన గంగారం మండల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను మాత్రం సురక్షిత రవాణా సదుపాయం కల్పించకుండా ట్రాక్టర్ ట్రాలీలో తరలించడం విస్మయానికి గురిచేసింది. కనీసం బస్సు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా అధికారులకు రాకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.
ఒకవైపు గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. మరోవైపు వారి బిడ్డల భద్రతను ఇలా గాలికొదిలేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినులను ప్రమాదకర పరిస్థితుల్లో తరలించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? రవాణా బాధ్యతలు చూసుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
వేడుకల విజయంపై ప్రచారం చేసుకోవడం కంటే విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.