🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 12 November 2026, 5:51 pm Posted by : P. Shekar

అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7 లక్షల విరాళం

News Image

బీరంగూడ, నవంబర్ 12 (సీ కే న్యూస్ ప్రతినిధి ):



దేవాలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించడంలో ముందుండే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడలో నిర్మాణంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7,00,116 విరాళంగా అందజేశారు. ముఖ్యంగా ద్వారపాలకుల మండపం నిర్మాణం కోసం ఈ విరాళాన్ని ప్రకటించారు.
ఈ నెల 22న నిర్వహించనున్న అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని పృథ్వీరాజ్ దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమై ప్రతిష్ఠా మహోత్సవ ఏర్పాట్లతో పాటు దేవస్థాన నిర్మాణం, అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధికి రూ.7,00,116 విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకలని పేర్కొన్నారు. దేవాలయాలు భక్తితో పాటు ఐక్యత, సేవాభావం, సామాజిక సమైక్యతను పెంపొందించే పవిత్ర కేంద్రాలని అన్నారు. దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి భక్తులు, దాతలు తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులోనూ ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు తన సహకారం కొనసాగిస్తానని తెలిపారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాద్రి పృథ్వీరాజ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, దేవస్థాన అభివృద్ధికి భారీ విరాళం అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన సహకారం ఆలయ నిర్మాణ పనులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రముఖులు, అయ్యప్ప స్వామి భక్తులు, ఎంఆర్‌పీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home