🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 8:02 pm Posted by : A2TV NEWS

నవంబర్ నెలాఖరులోగా తొలి విడత భూ రీసర్వే పూర్తి చేయాలి

News Image
  • రీసర్వేలో పారదర్శకత పాటించాలి.. ప్రజల అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి – అదనపు కలెక్టర్ టి. వినోద్ కుమార్

వనపర్తి, నవంబర్ 11: జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) టి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు, ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు, వివాదాలు తలెత్తకుండా రీసర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
బుధవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూముల రీసర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి వనపర్తి కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రీసర్వేలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం అందించి, నోటీసులు జారీ చేసిన అనంతరం వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు వివరాలు తెలియజేయడంతో పాటు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పించాలని, వచ్చిన అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో రీసర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. అసైన్డ్ భూముల పట్టాల అసలుదనం, భూముల వాస్తవ విస్తీర్ణం, పట్టాదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. చెరువులు, కుంటలు, రహదారులు, ఇతర అభివృద్ధి పనుల కోసం గతంలో సేకరించిన భూములకు సంబంధించిన సర్వే నంబర్ల సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించాలన్నారు.
రీసర్వే పూర్తయిన ప్రాంతాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూఆర్ కోడ్‌తో అందించనున్న నేపథ్యంలో సర్వే వివరాలు, భూ రికార్డుల్లో ఎలాంటి తప్పులు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఆర్వో రామ్ రెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సర్వే శాఖ ఏడీ శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home