విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం - సీనియర్ సివిల్ జడ్జి బి. సౌజన్య
రామచంద్రాపురం, నవంబర్ 06(నవజ్యోతి ప్రతినిధి):
విద్యార్థులు చిన్ననాటి నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు ఇతరుల హక్కులను గౌరవించాలని సంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య సూచించారు. హైకోర్టు అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి బి. సౌజన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, బాలల రక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టం, సైబర్ నేరాలు, మొబైల్ ఫోన్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలికల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు కేవలం విద్యా విషయాలకే పరిమితం కాకుండా సామాజిక స్పృహ, రాజ్యాంగ విలువలు, పౌర బాధ్యతలను కూడా అలవర్చుకోవాలని వక్తలు సూచించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా సమాజంలో జరిగే అన్యాయాలను గుర్తించి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ విజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.