🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 7:54 pm Posted by : P. Shekar

జర్నలిజం వృత్తి విలువలను కాపాడుకోవాలి - దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పిలుపు

పటాన్చెరు, నవంబర్ 04(సీ కే న్యూస్ ప్రతినిధి):


జర్నలిజం వృత్తి విలువలు, నైతిక ప్రమాణాలను కాపాడుకుంటూ ప్రజల్లో విశ్వసనీయతను పెంపొందించుకోవాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్టుపై ఉందని ప్రముఖులు దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘాలు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. గతంలో జర్నలిస్టు సంఘాల పోరాటాల ఫలితంగా హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు అమలయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుతం జర్నలిస్టులకు ఆరోగ్య బీమా సదుపాయం లేకపోవడం ఆందోళనకరమన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో హెల్త్ కార్డులు నిరుపయోగంగా మారుతున్నాయని, దీంతో ఆసుపత్రులు వైద్య సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి సందర్భంగా అర్హతను బట్టి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సూచించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే రాష్ట్రంలో జర్నలిస్టుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ హామీ అమలుపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. జర్నలిజం రంగంలో మహిళా జర్నలిస్టుల సంఖ్య పెరిగేలా సంఘాలు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని సూచించారు.
సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలపై ప్రతి అంశాన్ని ప్రచురించడం మాత్రమే జర్నలిజం కాదని, సమాజానికి ఉపయోగపడే వాస్తవిక, బాధ్యతాయుతమైన వార్తలను అందించడమే అసలైన జర్నలిజమని స్పష్టం చేశారు. వృత్తి నైపుణ్యం, నైతిక విలువలను విస్మరిస్తే జర్నలిజం విశ్వసనీయత దెబ్బతింటుందని హెచ్చరించారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిజం వృత్తిలో మనం దారి తప్పుతున్నామా? అనే అంశంపై ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సమాజంలో జర్నలిస్టులకు గతంలో ఉన్న గౌరవం తగ్గడానికి కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 66 మంది అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 100 మంది కార్యవర్గ సభ్యులతో అతిపెద్ద సంఘంగా ఉన్న యూనియన్ ప్రతి జర్నలిస్టు సమస్యను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. కింది స్థాయి నుంచి ప్రతి సమస్య పరిష్కారానికి స్థానిక నాయకత్వం బాధ్యత తీసుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణమన్నారు.
పత్రికా యాజమాన్యాలు తమ సంస్థల అభివృద్ధి, విధానాలకు అనుగుణంగా పనిచేస్తాయని, జర్నలిస్టులు మాత్రం వృత్తి నిబద్ధతను కాపాడుకుంటూ ప్రజా సమస్యలను ధైర్యంగా ప్రశ్నించాలని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జర్నలిస్టుల హక్కులు, సమస్యల విషయంలో సంఘం రాజీపడబోదని స్పష్టం చేశారు. సమస్యలను ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్టులకు సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రోడ్డుపైకి వచ్చి పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు.
మరోవైపు జర్నలిస్టుల పేరుతో నకిలీ గుర్తింపులు పొందుతూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న వారిని అరికట్టాల్సిన బాధ్యత జర్నలిస్టు సంఘాలపై ఉందని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తుల వల్ల నిజమైన జర్నలిస్టుల గౌరవం, వృత్తి ప్రతిష్ట దెబ్బతినకుండా సంఘటితంగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు వృత్తి నైతికత, ప్రజా విశ్వసనీయతను కాపాడుకోవడంలో సంఘాలు ముందుండాలని ఇరువురు నేతలు స్పష్టం చేశారు.
🏠 Home