🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 03 November 2026, 3:58 pm Posted by : P. Shekar

యువ ఆవిష్కర్తలకు గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్ – 2026 రూ.50 లక్షల వరకు నగదు బహుమతులు

News Image


పటాన్చెరు, నవంబర్ 03(సీ కే న్యూస్ ప్రతినిధి):


దేశవ్యాప్తంగా ఉన్న యువ ఆవిష్కర్తల్లో నూతన ఆలోచనలను ప్రోత్సహించి, వాటిని విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్ (జీఐసీ)–2026ను నిర్వహించనుంది. ఈ జాతీయ స్థాయి పోటీలో విజేతలకు దాదాపు రూ.50 లక్షల వరకు నగదు బహుమతులు అందించనుంది. గీతం వెంచర్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో, బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ పోటీలో 10 నుంచి 12వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థులు, అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 2025 నుంచి పట్టభద్రులైన వారు పాల్గొనవచ్చు. జూనియర్, సీనియర్ అనే రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించి, వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే యువతకు నగదు బహుమతులతో పాటు నిపుణుల మార్గదర్శకత్వం, వెంచర్ కోచింగ్, ఇంక్యుబేషన్ అవకాశాలు కల్పించనున్నారు.
జీఐసీ–2026లో భాగంగా ఆన్‌లైన్ స్క్రీనింగ్, వర్చువల్ బూట్ క్యాంప్, వ్యక్తిగత మార్గదర్శకత్వం, ఆన్‌లైన్ సెమీ ఫైనల్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగనుండగా, డిసెంబర్ 11న గీతం హైదరాబాద్ క్యాంపస్‌లో జాతీయ స్థాయి గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు.
వాతావరణ మార్పులు, సుస్థిరత, వ్యవసాయం, ఫుడ్ టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, డీప్ టెక్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రీడలు, ఫిట్‌నెస్, డైరెక్ట్ టు కన్స్యూమర్ తదితర రంగాల్లో వినూత్న పరిష్కారాలను ఈ పోటీ ద్వారా ప్రోత్సహించనున్నారు.
సీనియర్ విభాగంలో విజేతలకు రూ.2 లక్షల వరకు నగదు బహుమతులతో పాటు గీతం ఐ-టిబీఐలో ఆరు నెలల ఇంక్యుబేషన్ సదుపాయం కల్పించనున్నారు. జూనియర్ విభాగం ఫైనలిస్టులకు లీడ్ ప్రోగ్రామ్‌తో పాటు ఏడాది పాటు వ్యక్తిగత వెంచర్ కోచింగ్ అందించనున్నారు. అదనంగా ఉత్తమ సామాజిక ప్రభావ వ్యాపార ఆలోచన అవార్డు, లెబెన్ జాన్సన్ పీపుల్స్ ఛాయిస్ అవార్డు, డాక్టర్ జీవీవీ రావు యంగ్ ఇంజనీర్ డ్రీమర్ అవార్డులను అందించనున్నారు.
గత పోటీల ద్వారా ఐదు వేలకు పైగా స్టార్టప్ ఆలోచనలు, వందకు పైగా పిచ్‌లు, 50 మందికి పైగా జ్యూరీ సభ్యులు, 30కి పైగా భాగస్వాములు, 29 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు భాగస్వాములయ్యారని నిర్వాహకులు తెలిపారు. యువతలో ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తల స్ఫూర్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా జీఐసీ పోర్టల్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 90630 65811, 83283 34930 నంబర్లను సంప్రదించాలని తెలిపారు
🏠 Home