వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
- రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం, నవంబర్ 02(సీ కే న్యూస్ ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపల్ పరిధిలో గల సోలక్పల్లి, ఊట్ల, జిన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గోపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు సహా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును 24 గంటల్లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ బోనస్‌ను సైతం వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కమిషనర్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రభాకర్ రెడ్డి, పావని పరమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.