అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు… మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- *అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు… మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
- *గ్రామాల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తాం*
- *కూసుమంచి మండలం గోరీలపాడు తండా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి*
- సికె న్యూస్ ప్రతినిధి
- ఖమ్మం/కూసుమంచి
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం కూసుమంచి మండలం గోరిల్లపాడు తండాలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామానికి డబల్ రోడ్డు, పొలాలకు వెళ్లే దారులు, స్మశాన వాటికల ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. ఎల్2, ఎల్3, ఎల్1 లలో అర్హులైన పేదవాళ్లకు ఎవరికైనా పొరపాట్లు ఉంటే సరిదిద్ది ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నవారికైనా, అర్హులైతే ఈ ప్రభుత్వంలో ఇళ్లు ఇవ్వకుండా ఉండేది లేదని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని, ఇప్పుడు రెండో విడత, ఆపై మూడు, నాలుగు విడతల్లో అర్హులందరికీ ఇస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రజలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతు భరోసా, సన్న వడ్లు పండించిన రైతన్నలకు మద్దతు ధరతో పాటు బోనస్, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, తెల్ల రేషన్ కార్డులు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, డీపీవో వినోద్ కుమార్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, కూసుమంచి ఎంపీడీవో జస్వంత్ కుమార్, తహసీల్దార్ సైదులు, స్థానిక సర్పంచ్ బానోత్ సరస్వతి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.