🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 4:58 pm Posted by : CK NEWS

ముకుందాపురం న్యూడెమోక్రసీ నాయకుడు ఐలు కంఠ్లమయ్యకు జోహార్లు

News Image
  • ముకుందాపురం న్యూడెమోక్రసీ నాయకుడు ఐలు కంఠ్లమయ్యకు జోహార్లు
  • ఎర్రజెండా కప్పి నివాళులర్పించిన పార్టీ నాయకులు – కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
  • సి కె న్యూస్ ప్రతినిధి,

ఇల్లందు అక్టోబర్ 13 : సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ముకుందాపురం క్యాంపు గ్రామ కమిటీ సభ్యుడు కామ్రేడ్ ఐలు కంఠ్లమయ్య (కంట్లమయ్య) మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ నాయకులు నరాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చిన్నతనం నుంచే న్యూడెమోక్రసీ రాజకీయాల పట్ల ఆకర్షితులైన కంఠ్లమయ్య కొద్దికాలంలోనే గ్రామ కమిటీలో క్రియాశీలక సభ్యుడిగా ఎదిగారని తెలిపారు. పదేళ్ల క్రితం గుండె ఆపరేషన్ జరిగినప్పటికీ పార్టీ సభ్యత్వాన్ని కొనసాగిస్తూ, ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లలేకపోయినా గ్రామంలో తనకు చేతనైనంతవరకు పార్టీకి సహకరిస్తానని చెప్పేవారని గుర్తుచేశారు.

ఎంతోమంది పార్టీలు మారుతున్నా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూడెమోక్రసీ రాజకీయాలకు దూరం కాబోనని ఆయన చెప్పేవారని పేర్కొన్నారు. గత పది రోజులుగా శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకడంతో ఖమ్మం, హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు.

పార్టీకి తీరని లోటు

కామ్రేడ్ అయిలు కంఠ్లమయ్య మృతి ఆయన కుటుంబానికి, న్యూడెమోక్రసీ గ్రామ కమిటీకి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ముకుందాపురం క్యాంపు గ్రామ కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కారేపల్లి మండల నాయకులు కొయడ శ్రీను, మాస్‌లైన్ నాయకులు తుమ్మలపల్లి ప్రసాద్, ముకుందాపురం క్యాంపు గ్రామ కమిటీ కార్యదర్శి బైరెడ్డి అనిల్ రెడ్డి, దొంతు లక్ష్మయ్య, కాంపాటి కొటయ్య, గంగారపు కొటయ్య, ఆవుల చంద్రయ్య, అన్నాబత్తుల లింగస్వామితో పాటు బంధుమిత్రులు పాల్గొన్నారు.
🏠 Home