పెండింగ్ అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి: టీజేఏ డిమాండ్
- జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
- పెండింగ్ అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి: టీజేఏ డిమాండ్
- జర్నలిస్టుల పిల్లలకు విద్యలో 50 శాతం రాయితీ కల్పించాలి
ఖమ్మం: జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖమ్మంలో జర్నలిస్టులకు కేటాయించిన 23 ఎకరాల భూమిని అర్హులైన జర్నలిస్టులకు వెంటనే పంపిణీ చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (TJA) ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అలాగే పెండింగ్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను తక్షణమే మంజూరు చేసి అందించాలని కోరుతూ ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డికి టీజేఏ నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టీజేఏ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గతంలో జర్నలిస్టుల కోసం కేటాయించిన 23 ఎకరాల భూమి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా పెండింగ్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని, దీనివల్ల జర్నలిస్టులు తమ వృత్తిపరమైన విధులను మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఈఓను టీజేఏ యూనియన్ ఆధ్వర్యంలో సన్మానించి, జర్నలిస్టుల పిల్లలకు విద్యలో 50 శాతం రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమం కోసం విద్యా రంగంలో ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాలని టీజేఏ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీజేఏ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు జి. నాగస్వామి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు శంకువార్ ప్రశాంత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖాసిం, ఖమ్మం టౌన్ అధ్యక్షుదు ఎం.డి. రషీద్, జిల్లా నాయకులు వాసం రాజేంద్ర ప్రసాద్, నల్లమోతు శ్రీనివాసరావు, పవన్ కుమార్, వంశీ,వేంపటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.