ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
- ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
- లక్ష్మీపల్లి స్టేజీ వద్ద ఘటన.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు
- సీకే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి
చిన్నంబావి మండల పరిధిలోని లక్ష్మీపల్లి స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని సుజాతమ్మ (55) మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వెళ్తున్న కొల్లాపూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు (టీజీ 31 జెడ్ 0021) లక్ష్మీపల్లి స్టేజీ వద్ద ఆగకుండా ముందుకు వెళ్తుండగా బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళా ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో సుజాతమ్మ బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు, ప్రమాదం నుంచి బయటపడిన మహిళా ప్రయాణికుల కథనం మేరకు.. లక్ష్మీపల్లి స్టేజీ వద్ద బస్సు ఎక్కేందుకు మహిళలు ప్రయత్నిస్తుండగా డ్రైవర్ బస్సును ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న సుజాతమ్మను బస్సు ఢీకొట్టినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహం వద్ద బంధువుల ఆందోళన
ప్రమాద విషయం తెలియగానే చిన్నంబావి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సుజాతమ్మ మృతదేహాన్ని తరలించే విషయంలో బంధువులు, కుటుంబ సభ్యులు కొద్దిసేపు రోడ్డుపై ధర్నాకు దిగారు. కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం అందించాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
డిపో అధికారుల హామీ
విషయం తెలుసుకున్న కొల్లాపూర్ ఆర్టీసీ డిపో ఇన్చార్జి రత్నమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు, పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అలాగే వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్ కూడా ఘటనపై స్పందించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన ప్రయోజనాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కుటుంబానికి పరిహారం.. ఉద్యోగం ఇవ్వాలి
సుజాతమ్మ కుటుంబానికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పించాలని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇదే కుటుంబానికి చెందిన భాస్కర్‌గౌడ్, ఆయనతో పాటు ప్రయాణిస్తున్న గురువయ్య సుమారు ఆరేళ్ల క్రితం ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికీ ప్రభుత్వ పరిహారం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సుజాతమ్మ కూడా ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
నాయకుల పరామర్శ
ప్రమాద స్థలాన్ని మాజీ జడ్పిటిసి కేసిరెడ్డి వెంకటరమణమ్మ చిన్నారెడ్డి, మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ మధుసూదన్ రెడ్డి, ఉల్పాల మహేశ్వర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బిసన్న, లక్ష్మీపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.