🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 27 September 2026, 7:23 am Posted by : CK NEWS

రెడ్డి, రావు జాయేగా... బీసీ సీఎం ఆయేగా

News Image
  • *రెడ్డి, రావు జాయేగా... బీసీ సీఎం ఆయేగా*
  • *2028లో కొడంగల్‌లో బీసీ ఎమ్మెల్యే*
  • *తెలంగాణలో బీసీని సీఎం చేస్తాం*
  • *వాల్మీకి బోయలతో రాజకీయ సమాధి కట్టిస్తా*
  • *బీసీల జోలికొస్తే... తొక్కి నారా తీస్తా*
  • *కాంగ్రెస్ సర్కార్ కు తీన్మార్ హెచ్చరిక*
  • *గోల్కొండ నుంచి 250 కి.మీ. పాదయాత్ర చేసి కొడంగల్ చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర*
  • *బతుకమ్మలు,బోనాలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు*
  • *జై బీసీ నినాదంతో మార్మోగిన కొడంగల్*
  • *భారీగా తరలివచ్చిన జనం

సి కె న్యూస్ ప్రతినిది కొడంగల్: తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర కొడంగల్‌కు చేరుకుంది. గోల్కొండ ఖిల్లా నుంచి దాదాపు 250 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు.

ఈ సందర్భంగా “రెడ్డి, రావు జాయేగా... బీసీ సీఎం ఆయేగా”, “ఓట్ హమారా... రాజ్ తుమారా... నై చలేగా” అంటూ మల్లన్న నినదించారు

గోల్కొండ నుంచి కొడంగల్ వరకు 250 కి.మీ... ఇది రాజ్యాధికారం కోసం నడక

గోల్కొండ ఖిల్లా నుంచి ప్రారంభించిన బీసీ రాజ్యాధికార యాత్ర దాదాపు 250 కిలోమీటర్లు పూర్తి చేసుకొని కొడంగల్ గడ్డకు చేరుకుందని తీన్మార్ మల్లన్న తెలిపారు. ఈ పాదయాత్ర వ్యక్తిగత పదవుల కోసం కాదని, తరతరాలుగా రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా సాధించడం కోసమేనని పేర్కొన్నారు.

“మన ఓట్లు మనం వేసుకోవాలి... మన రాజ్యాన్ని మనమే ఏలుకోవాలి. మన జనాభాకు తగ్గ రాజకీయ వాటా మనకు రావాలి. అందుకోసమే గోల్కొండ నుంచి అడుగు మొదలుపెట్టాం. ఆ అడుగు ఇప్పుడు కొడంగల్ గడ్డకు చేరుకుంది” అని మల్లన్న పేర్కొన్నారు.

కేసీఆర్ అరాచకాలపై ప్రతిపక్షం లేని రోజుల్లోనే పోరాడా

2014 తర్వాత తెలంగాణలో బలమైన ప్రతిపక్ష గొంతు వినిపించని సమయంలో కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తాను పోరాడానని మల్లన్న చెప్పారు. తనపై మూడుసార్లు హత్యకు కుట్రలు జరిగాయని, తన కార్యాలయాలను ధ్వంసం చేశారని, చంచల్‌గూడ, చెర్లపల్లి జైళ్లలో వందల రోజులపాటు బంధించారని ఆయన అన్నారు.

“అప్పుడు నేను వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు కూడా తగ్గను. బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు” అని ఆయన స్పష్టం చేశారు.

20 లక్షల మంది బీసీలు ఎక్కడికి పోయారు?.. కులగణన లెక్కలపై మల్లన్న ప్రశ్న

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్లో బీసీల జనాభా సుమారు రెండు కోట్లు ఉంటే, ప్రస్తుత ప్రభుత్వ కులగణనలో దాన్ని 1.80 కోట్లకు తగ్గించారని ఆయన అన్నారు.

“20 లక్షల మంది బీసీలను తగ్గించి 7 లక్షల మంది రెడ్లను రేవంత్ రెడ్డి పుట్టించాడని అన్నారు.

కులగణన లెక్కలపై అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని నిలదీశానని, తాను తప్పుగా భావించిన ఆ లెక్కల పత్రాలను తగలబెట్టినట్లు చెప్పారు. ఆ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసును కూడా తగలబెట్టానని పేర్కొన్నారు. అనంతరం బీసీల కోసం మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదని తనను సస్పెండ్ చేసినట్టు తెలిపారు.

42 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయి?.. కామారెడ్డి డిక్లరేషన్ అమలు ఎక్కడ?

కాంగ్రెస్ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో విఫలమైందని అన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారని, కానీ ఆ హామీ అమలు కాలేదని,మహాత్మా జ్యోతిబాఫులే బీసీ సబ్‌ప్లాన్ కింద ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, సుమారు రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు.

రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ప్రతి జిల్లాలో రూ.50 కోట్లతో బీసీ కన్వెన్షన్ హాళ్లు, మహిళలకు రూ.4 వేల పెన్షన్, స్కూటీలు, తులం బంగారం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి హామీల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కొడంగల్‌లో 57 శాతం బీసీ ఓట్లు..

కొడంగల్ నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలను ప్రస్తావిస్తూ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,36,789 ఓట్లు ఉంటే, అందులో బీసీల ఓట్లు 1,36,034 వరకు ఉన్నాయని, అంటే సుమారు 57 శాతం ఓట్లు బీసీలవేనని ఆయన పేర్కొన్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓట్లు 12,567 మాత్రమే ఉన్నాయని చెప్పారు.

“లక్షా 36 వేల మంది బీసీలు ఉన్న కొడంగల్‌లో మనం ఎందుకు రాజకీయంగా వెనుక ఉండాలి? బీసీలు ఐక్యంగా నిలబడితే మన రాజకీయ భవిష్యత్తును మనమే నిర్ణయించుకోగలం. 2028 ఎన్నికల్లో కొడంగల్ గడ్డపై బీసీ ఎమ్మెల్యేను గెలిపించుకోవాలి” అని పిలుపునిచ్చారు.

ముదిరాజులను బీసీ-ఏలో చేరుస్తామన్న హామీ ఏమైంది?

ముదిరాజ్ సామాజికవర్గానికి ఇచ్చిన హామీలను కూడా మల్లన్న ప్రస్తావించారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మారుస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

“ముదిరాజులను బీసీ-ఏలో చేర్చగలిగితే వెంటనే చేర్చండి. చేయలేకపోతే కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా ముక్కు నేలకు రాసి వారికి క్షమాపణ చెప్పండి” అని డిమాండ్ చేశారు.

వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా ఎప్పుడు?

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న వాల్మీకి బోయల సమస్యను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు,సుమారు 2.90 లక్షల జనాభా ఉన్న వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ ఏళ్లుగా కొనసాగుతోందని, రాబోయే ఎన్నికల్లో ఇదే వాల్మీకి బోయలతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కట్టిస్తానని సవాల్ చేశారు.

వారి సమస్యను ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేసుకోవడం కాకుండా, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

1949 నిజాం ఫర్మానా రికార్డులు బయటకు తీస్తాం..

1949 ఆగస్టు 15 నాటి నిజాం ఫర్మానాకు సంబంధించిన రికార్డులను ప్రస్తావిస్తూ మల్లన్న భూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి జాగీర్దారీ వ్యవస్థ, భూముల రికార్డులకు సంబంధించిన పత్రాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పారు.

రెడ్లు,వెలమల ఆధీనంలో ఉన్న కోటి ఎకరాల భూములను పేదలకు పంచుతాం అని హామీ ఇచ్చారు.

2028లో బీసీ సీఎం లక్ష్యం.. “రెడ్డి, రావు జాయేగా... బీసీ సీఎం ఆయేగా”

కాంగ్రెస్‌లో రెడ్డి సామాజికవర్గం, బీఆర్‌ఎస్‌లో వెలమ సామాజికవర్గం, బీజేపీలో బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఉందని,తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పార్టీ అని గుర్తు చేశారు.

“2028లో కొడంగల్ నుంచి బీసీ ఎమ్మెల్యేను గెలిపించుకుందాం. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని కూర్చోబెడదాం. మన ఓట్లు మనమే వేసుకుందాం... మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం” అని పిలుపునిచ్చారు.

“రెడ్డి, రావు జాయేగా... బీసీ సీఎం ఆయేగా”, “ఓట్ హమారా... రాజ్ తుమారా... నై చలేగా” అంటూ నూతన నినాదం ప్రజల ముందుకు తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రజిని కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వేములవాడ మదన్ మోహన్ చారి, అశోక్ ముదిరాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు పటేల్ వనజక్క, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నరసయ్య గౌడ్,వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండి గౌస్, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు మున్నూరు జైపాల్ రెడ్డి,ఎంబిటి పార్టీ స్పోక్స్ పర్సన్ అంజద్ ఉల్లా ఖాన్, బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు దేవళ్ల సమ్మన్న, పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కొడంగల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
🏠 Home