కత్తెరతో మీ తోకలు కత్తిరిస్తాం
- కత్తెరతో మీ తోకలు కత్తిరిస్తాం
- “హమారా హిస్సా.. హమారా ఇజ్జత్.. హమారా హుకుమత్” కోసమే ఈ ఉద్యమం
- భూమిలేని పేదలకు భూములు..
- ముస్లిం మహిళలను అసెంబ్లీకి తీసుకెళ్తాం
- దారూర్ నుంచి తాండూర్ వరకు జనంతో మమేకమవుతూ సాగిన బీసీ రాజ్యాధికార యాత్ర
- చిరు వ్యాపారులు, దుకాణదారుల సాధక బాధకాలు తెలుసుకుంటూ ముందుకు సాగిన మల్లన్న
- ఖందేనేవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన..
- నాణ్యమైన విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
- తాండూర్ కార్నర్ మీటింగ్తో ముగిసిన బీసీ రాజ్యాధికార యాత్ర 9వ రోజు
సి కె న్యూస్ ప్రతినిది తాండూరు, సెప్టెంబర్ 25:
ప్రజలను పలకరిస్తూ.. వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ.. బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 9వ రోజు దారూర్ నుంచి ప్రారంభమై మంబాపూర్, ఖందేనేవెల్లి మీదుగా తాండూర్ వరకు కొనసాగింది. మార్గమధ్యంలో ప్రజలు, చిరు వ్యాపారులు, దుకాణదారులు, విద్యార్థులతో మల్లన్న మమేకమయ్యారు. తాండూర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్తో 9వ రోజు యాత్ర ముగిసింది.
సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర
దారూర్ నుంచి మంబాపూర్ వైపు సాగిన బీసీ రాజ్యాధికార యాత్రలో తీన్మార్ మల్లన్న స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. రోడ్డు వెంట ఉన్న చిరు వ్యాపారులు, దుకాణదారుల వద్ద ఆగి వారి వ్యాపార పరిస్థితులు, రోజువారీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ యాత్రను కొనసాగించారు.
ఖందేనేవెల్లి పాఠశాలలో విద్యార్థులతో ముచ్చట
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో భాగంగా ఖందేనేవెల్లికి చేరుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్య ఎంతో అవసరమని మల్లన్న పేర్కొన్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోంది
తాండూర్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మల్లన్న మాట్లాడుతూ, గత 80 ఏళ్లుగా రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్యాయానికి గురయ్యారని అన్నారు. రెడ్డి, వెలమ సామాజిక వర్గాల ఆధిపత్యం కారణంగా బీసీలకు దక్కాల్సిన రాజకీయ అవకాశాలు, వనరులు దక్కలేదని గుర్తు చేశారు.
బీసీల చేతుల్లో ఉండాల్సిన భూములు రెడ్లు,వెలమల ఆధీనంలోకి వెళ్లాయని పేర్కొంటూ, కొండా వెంకట రంగారెడ్డి, నిజాం కాలం నాటి ఫర్మానాకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. భూములకు సంబంధించిన చారిత్రక రికార్డులు, ఫర్మాన కాగితాన్ని దాచిపెట్టి పేదలకు దక్కాల్సిన కోటి ఎకరాల భూమిని రెడ్లు,వెలమలు అప్పనంగా కాజేశారని మండిపడ్డారు.రేపటి బీసీ ప్రభుత్వంలో ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచి పెడతాం అని హామీ ఇచ్చారు
రాబోయే ఎన్నికల్లో బీసీలు రాజకీయంగా ఐక్యంగా ఉండాలని, బీసీ అభ్యర్థులకు బీసీలు మద్దతు ఇవ్వాలని మల్లన్న పిలుపునిచ్చారు. “మన ఓట్లు మనం వేసుకుందాం.. మన రాజ్యాన్ని మనమే సాధించుకుందాం” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
“హమారా హిస్సా.. హమారా ఇజ్జత్.. హమారా హుకుమత్” కోసమే ఈ ఉద్యమం
బీసీ రాజ్యాధికార యాత్ర కేవలం రాజకీయ యాత్ర కాదని, బీసీలు సహా అణగారిన వర్గాలకు దక్కాల్సిన వాటా, ఆత్మగౌరవం, రాజకీయ అధికారం సాధించేందుకు చేస్తున్న ఉద్యమమని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.
“హమారా హిస్సా.. హమారా ఇజ్జత్.. హమారా హుకుమత్” అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. “మా వాటా.. మా ఆత్మగౌరవం.. మా అధికారం” కోసమే ఈ పోరాటమని స్పష్టం చేశారు.
జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం, అవకాశాలు, వనరుల్లో న్యాయమైన వాటా దక్కాలని అన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేద వర్గాలు తమ హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో బీసీలకు సంబంధించిన లెక్కలు తప్పుగా ఉన్నాయని, ఆ లెక్కలను తాను అంగీకరించబోనని చెబుతూ, వాటికి సంబంధించిన పత్రాలను నిరసనగా తగలబెట్టినట్లు తెలిపారు.
బీసీల సమస్యల గురించి మాట్లాడినందుకే తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్న మల్లన్న, బీసీల రాజకీయ ఆకాంక్షలకు సరైన వేదిక అవసరమనే ఉద్దేశంతో మేధావులు, వివిధ వర్గాల సూచనల మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పార్టీకి కత్తెర గుర్తును తీసుకొచ్చామని, రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న రెడ్డి,వెలమ ఆధిపత్యాన్ని రాజకీయంగా ఎదుర్కొంటామని,కత్తెర గుర్తుతో వాళ్ల తోకలను కత్తిరిస్తాం అని హెచ్చరించారు.
ముస్లిం మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం
తెలంగాణ రాజకీయాల్లో ముస్లిం మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని మల్లన్న అన్నారు. గత 80 ఏళ్లుగా ఒక్క ముస్లిం మహిళ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదని పేర్కొంటూ, భవిష్యత్తులో బీసీ రాజ్యాధికారం ఏర్పడితే ముస్లిం మహిళలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేద వర్గాలకు రాజకీయ అధికారంతో పాటు ఆర్థిక అవకాశాలు, విద్య, భూమిపై హక్కులు దక్కాలన్నదే బీసీ రాజ్యాధికార యాత్ర లక్ష్యమని మల్లన్న పేర్కొన్నారు.
ప్రజలతో నేరుగా మమేకమవుతూ సాగిన బీసీ రాజ్యాధికార యాత్ర 9వ రోజు దారూర్ నుంచి మంబాపూర్, ఖందేనేవెల్లి మీదుగా తాండూర్ చేరుకుని కార్నర్ మీటింగ్తో ముగిసింది. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు “మా వాటా.. మా ఆత్మగౌరవం.. మా అధికారం” అనే లక్ష్యంతో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, విద్య, భూములు, సామాజిక న్యాయం అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ యాత్ర కొనసాగుతోంది.